E-PAPER

స్ట్రిక్ట్ వార్నింగ్: డ్రైనేజీ దాటితే రూ.5,000 జరిమానా

మణుగూరు;
ఈ రోజు మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో రోడ్ల ఆక్రమణలు, కూరగాయల పాటకొట్లు, షాపుల ముందున్న తోపుడు బండ్లు, రహదారిపై చిరు మరియు వీధి వ్యాపారుల తాత్కాలిక ఆక్రమణల వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల సంఘం బాధ్యులు, ఫ్రూట్, ఫ్లవర్ షాప్‌ల యజమానులు, చిరు మరియు వీధి వ్యాపారస్తులు పాల్గొని తమ సాధక–బాధకాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
మున్సిపల్ కమిషనర్ టీ. ప్రసాద్ బాబు మాట్లాడుతూ, షాపులు ఉన్నప్పటికీ రోడ్లపై వ్యాపారాలు చేయడం, డ్రైనేజీ దాటి తోపుడు బండ్లు, సైన్ బోర్డులు, పబ్లిసిటీ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ప్రజల భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి, అందరి సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
డ్రైనేజీ దాటి వ్యాపారం చేస్తే తప్పనిసరిగా రూ.5,000 జరిమానా విధిస్తున్నట్టు ఈ సందర్భంగా వ్యాపారులకు తెలియజేస్తూ, గీత దాటితే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సైన్ బోర్డులు, పబ్లిసిటీ బోర్డులు డ్రైనేజీ లోపలే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి అని, అలా తీసుకుంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని వివరించారు. ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు, చెత్త సేకరణలో పౌరుల బాధ్యతను కూడా కమిషనర్ వివరించారు.
వీధి వ్యాపారస్తుల సౌకర్యార్థం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న ట్యాంక్‌బండ్ స్థలం, తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న స్థలాన్ని తాత్కాలికంగా సూచించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం, నిధుల కొరత కారణంగా అది పూర్తయ్యే వరకు ఈ రెండు ప్రాంతాల్లోనే వ్యాపారం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో పట్టణ సీఐ నాగబాబు మాట్లాడుతూ, మేడారం జాతర నేపథ్యంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిందని, సింగరేణి బొగ్గు లారీలు, ఇసుక లారీలు, పట్టణ ప్రజల రాకపోకలు కలిసి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, గీత దాటితే ఉపేక్షించేది లేదని సీఐ గట్టిగానే హెచ్చరించారు. “మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, అదే విధంగా మన రహదారులను కూడా శుభ్రంగా, సక్రమంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని ఆయన సూచించారు.
టీపీఓ మాట్లాడుతూ, వ్యాపారస్తులకు డ్రైనేజీ వరకే అధికారం ఉంటుందని, డ్రైనేజీ దాటితే అది ప్రభుత్వ స్థలంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. డ్రైనేజీ నుంచి చూస్తే ఆకాశం కనిపించేలా, డ్రైనేజీ మీద నిలబడి చూసినా ఆకాశం కనిపించేలా ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని తెలిపారు. వానాకాలంలో డ్రైనేజీలు శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నందున డ్రైనేజీలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాల్సి ఉంటుందని, ఈ విషయంలో వ్యాపారస్తులు సహకరించాలని కోరారు.
టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటీకాల భాస్కర్, షైనీ, మడకం మధు మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీల ఆక్రమణ వల్ల ఏర్పడుతున్న సమస్యలను వివరించి, అతిక్రమించిన వారిపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయాలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కూరగాయలు, ఫ్రూట్, ఫ్లవర్ షాప్‌లు సహా అన్ని రకాల వ్యాపారస్తులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మాట్లాడుతూ తమ అసోసియేషన్ సభ్యులకు తగిన సూచనలు చేస్తామని, సరిచేసుకునేందుకు 10 రోజుల సమయం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీపీఓ, మున్సిపల్ అధికారులు మాధవి సహా ఇతర అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వివిధ వ్యాపార సంఘాల బాధ్యులు, వీధి వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News