అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను శ్రీకాకుళం నగరంలోని కె.ఆర్. స్టేడియంలో జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రథసప్తమి ఉత్సవాల నిర్వహణలో భాగంగా కె.ఆర్. స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, అత్యవసర సేవల కోసం ప్రత్యేక మార్గాల కేటాయింపు, గ్యాలరీలు మరియు బారికేడ్ల పటిష్టత తదితర అంశాలను జిల్లా ఎస్పీ పరిశీలించి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున గ్యాలరీలు, సిట్టింగ్ ఏర్పాట్లు, బారికేడ్లు పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉండాలని సూచించారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న థమన్ మ్యూజికల్ షో వేదికను కూడా జిల్లా ఎస్పీ పరిశీలించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తోపులాటలు లేదా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన కిడ్స్ ప్లే ఏరియా, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఇతర వేదికలను పరిశీలించిన జిల్లా ఎస్పీ, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లోటు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ స్టాళ్లను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను క్రమబద్ధీకరించాలని, వాహనాల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించాలని అధికారులకు సూచించారు. భక్తులు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, డీఎస్పీ వివేకానంద, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇమ్మనయిల్ రాజు, అలాగే రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.









