శ్రీకాకుళం | మందస మండలం | హరిపురం | డిసెంబరు 29
పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా సోమవారం మందస మండలం హరిపురం గ్రామంలో మాదకద్రవ్యాల నివారణపై విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్. తిరుపతిరావు, మందస ఎస్సై కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహాబజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, కుటుంబాలు–సమాజం తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ అభ్యుదయం సైకిల్ యాత్ర సభ్యులను సత్కరించి అభినందించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అవగాహన సభలో పాల్గొన్న విద్యార్థులు, యువత, స్థానికులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1972 / 100 / 112కు తెలియజేయాలని పోలీసులు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
“మాదకద్రవ్యాలు వద్దు – ఆరోగ్యకరమైన సమాజమే కావాలి” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు.
యువత శక్తి దేశాభివృద్ధికి ఇంధనం కావాలని, వ్యసనాలకు బానిస కాకూడదని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.









