E-PAPER

మణుగూరులో కాంగ్రెస్ పార్టీకి మండల కార్యాలయం ఎందుకు లేదు?

పార్టీ అధికారంలో ఉన్నా కార్యకర్తలకు నిలయంలేని పరిస్థితి – ఇది మారాల్సిన వ్యవస్థాత్మక వైఫల్యమా?

✍️ ప్రత్యేక విశ్లేషణ — పులిపాటి పాపారావు, 

మణుగూరు, పినపాక నియోజకవర్గానికి హార్ట్ బీట్. రాజకీయం, ఉద్యమాలు, సంఘర్షణలు, పార్టీ మార్పులు – ఇవన్నింటికీ కేంద్ర బిందువుగా ఎదిగిన మండల కేంద్రం ఇది. అలాంటి రాజకీయ శక్తి కేంద్రమైన మణుగూరులో కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకి “ఒక పార్టీ కార్యాలయం” కూడా లేకపోవడం ఏమిటి? ఇది కేవలం మౌలిక వనరుల లోపమేనా? లేక పార్టీ అగ్రనాయకత్వానికి సన్నిహిత మండలాలకి ప్రాధాన్యత ఇచ్చే దురాచారం పరంపరా?

మౌలిక భవనమా కాదు – రాజకీయ నిర్మాణమే లేదు

పార్టీ కార్యాలయం అంటే ఒక నాలుగు గోడల భవనం కాదు. అది భావాల ఆవిర్భావం, కార్యకర్తలకు ఉత్సాహం, ప్రజలకు ఆశ్రయం. ప్రస్తుతం మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ సమావేశమవుతున్నారు? కొంతమంది పెరటి మైదానంలో, మరికొందరు టీ కోట్లు, హోటల్ లలో.ఇది పార్టీ నిర్వీర్యతకు అద్దం.

మణుగూరులో జరిగిన కార్నర్ మీటింగ్‌ను, రాహుల్ గాంధీ హాజరైన దృశ్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అప్పటి ఉత్సాహం, ప్రోత్సాహం చూసి స్థానికంగా చాలామంది పార్టీ వైపు మొగ్గుచూపారు. కానీ ఇప్పుడు గెలుపు అనంతరం ఒక అధికారిక పార్టీ ఆఫీసు కూడా ఏర్పాటు చేయకపోవడం  ప్రజల్లో ఇదే సందేహం తెరపైకి తెస్తోంది:

“గెలిచిన తర్వాత మమ్మల్ని మర్చిపోయారా?”

క్యాంప్ కార్యాలయం – పార్టీ కమిట్‌మెంట్

ఎంఎల్యే పాయం వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం — ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు వింటారు. కానీ పార్టీ సమస్యలు ఎవరు వింటారు? కార్యకర్తలకు అభిప్రాయాల మార్పిడి, వ్యూహాల రూపకల్పన, సభ్యత్వ నియమాక కార్యక్రమాలు, శిక్షణ – ఇవన్నీ ఎక్కడ జరగాలి? ఇవి ఎవరెవరి ఇంట్లో జరగాలి?

ఇది ఒక ప్రాంతానికే అపమానం కాదు – పార్టీ స్థాయికి అసమ్మతమే

ఒక జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్యకర్తలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒక నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో పార్టీ ఆఫీసు పెట్టలేని స్థితిలో ఉందంటే… అది పార్టీ యొక్క స్థానిక స్థాయిలో నెగ్గిన… ఓటమినే సూచిస్తుంది. ఇది ఖాళీగా గడిచిపోయే అనూహ్య ఘటన కాదు — ఇది వ్యూహపరంగా పునఃపరిశీలన చేయాల్సిన తక్షణ సమస్య.

కార్యకర్తల గుండెచప్పుడు — పాలకుల చెవిలో పడుతుందా?

కాంగ్రెస్ కార్యకర్తలు పరోక్షంగా ఇదే చెబుతున్నారు:

“ఇలాకా మనదే… కానీ ఇల్లు లేదు. పార్టీ అధికారంలో ఉంది… కానీ మేము అడుగుపెట్టే స్థలం లేదు!”

ఈ మాటలు వినిపించకపోతే, రేపటి రోజున వారు “ఇక్కడ ఎవరు లేకపోయినా లేడు” అనే భావనతో పార్టీకి మానసికంగా దూరమయ్యే ప్రమాదం ఉంది.

నా అభిప్రాయం — చర్యలు లేకపోతే చతికిలపడటం ఖాయం

ఒక జర్నలిస్టుగా గత కొన్ని రోజులుగా మణుగూరులో ఉన్న నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నాను. కార్యకర్తల్లో అణచివేత కనిపిస్తోంది. ప్రజల్లో విముఖత మొదలవుతోంది. చిన్న సమస్యలు పెద్ద బాధ్యతలకీ నాంది అవుతాయి. ఒక కార్యాలయం ఏర్పాటు చేయడం కష్టం కాదు — కానీ పార్టీ ఓటమికి ఓ కారణం కూడా అవుతుంది.

“ఇంటి చిరునామా లేని నాయకత్వం… హద్దులేని బాధ్యతకే దారితీస్తుంది.”

ఒక పార్టీకి చిరునామా ఉండాలి — నాయకత్వానికి పునాదులు కావాలి.కాంగ్రెస్ పార్టీ మణుగూరులో తక్షణమే ఓ మండల కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఇది పార్టీ పరిపక్వతకు గుర్తు. కార్యకర్తల గౌరవానికి గుర్తు. ప్రజలలో నమ్మకం పెంచుకోవడానికి వేసే ప్రథమ అడుగు. లేదంటే, “పార్టీ అధికారంలో ఉంది” అన్న మాట ఒక వాదనగా మిగిలిపోతుంది ...

✍️ పులిపాటి పాపారావు

సీనియర్ జర్నలిస్టు | ప్రజా విశ్లేషణ విశేషం

 

 

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News