సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి.
కాకినాడ,నవంబర్ 23 వై 7 న్యూస్ ప్రతినిధి
దేశ సంపద సృష్టికర్తలమైన మనం ఉచిత పథకాల కోసం పాకులాడకుండా సంపదలో రాజ్యాధికారంలో
న్యాయమైన వాటా కోసం పోరాడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. శ్రామికులు శ్రమిస్తేనే సంపద పుడుతుందని, అంబానీ, ఆదానీలు సంపద సృష్టికర్తలు కాదన్నారు. “కులగణన-సామాజిక న్యాయం”అనే అంశంపై కాకినాడ అంబేద్కర్ భవన్లో శనివారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలకవర్గాలు అధికారం కోసం మోసాలు చేస్తూనే ఉన్నారన్నారు. మన నోరు మూయించడానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మనకు రావాల్సిన వాటాను పొందడం మన హక్కుగా భావించాలన్నారు. మనం సృష్టిస్తున్న సంపదలో 60 శాతం సంపన్న వర్గాలకే వెళ్ళిపోతుదంన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారని ,ఆయన ఆశయాలను మనం సాధించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా యువత చైతన్యవంతులై హక్కుల సాధన కోసం కృషి చేయాలన్నారు . బ్రిటిష్ కాలంలోనే కులగణన జరిగిందని, వారి పరిపాలన సౌలభ్యం కోసం, దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కులగణన చేపట్టారన్నారు. బ్రిటిష్ వారు అగ్రవర్ణాలకు ఆగ్రహం కలిగించకుండా పరిపాలన సాగించారన్నారు. భారతదేశంలో ఉన్నన్ని అసమానతలు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. అందరికీ సమానమైన హక్కులు లేవని, హక్కులను పరిమితం చేశారన్నారు. దళితులు ఇప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు అన్నారు. క్లాస్ -4 ఉద్యోగాలకే ఎస్సీ ఎస్టీలు పరిమితం అవుతున్నారని, ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందలేకపోతున్నారన్నారు. పెద్ద పెద్ద పొడవైన విగ్రహాలు పెట్టి సామాజిక న్యాయం చేస్తున్నామని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సిపిఎం నాయకులు, కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ, కులగణన వల్ల సామాజిక న్యాయం జరిగింది లేనిది తెలుసుకోవచ్చని, ఆర్థికంగా బలపడింది లేనిది కూడా తెలుస్తుంది అన్నారు. ప్రభుత్వ పాలనలో నష్టపోయిందెవరు, బాగుపడింది ఎవరో కూడా తేలుతుంది అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ కులగణనను వ్యతిరేకిస్తున్నాయని, దీనివల్ల వివాదాలు చలరేగుతాయని చెప్పడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. మను ధర్మాన్ని బ్రాహ్మణ భావజాలం కొనసాగాలని బిజెపి కోరుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేయడం పెద్ద కుట్రని,ప్రజల జీవన స్థితిగతులు ఇంకా దిగజారే విధంగా పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. యువత మరింత చైతన్యవంతులై పాలకుల విధానాన్ని ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వజ్జిపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగమే మనకు అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని, బిజెపి పాలనలో రాజకీయ విధ్వంసం జరుగుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన రావాల్సిన వాటా మనకు దక్కట్లేదన్నారు. కుల వివక్ష అసమానతలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ మనకు అనేక హక్కులు కల్పించారని వాటిని కాపాడుకోవాలని అన్నారు. రిజర్వేషన్ లేకపోతే మన పరిస్థితి మరి దారుణంగా ఉండేది అన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు బి కళ్యాణ్ రావు మాట్లాడుతూ కలిసికట్టుగా పోరాడాలి అన్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు రాజకీయ లబ్ధి కోసమే అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ కుల గణన జరగాలన్నారు. దళితుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలుచేపడతామన్నారు.
డీహెచ్పిస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి జి రాంబాబు, ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, టీ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.