తనపై నమోదైన కేసుల గురించి, చేసినఅవినీతిపై విడదల రజిని సమాధానం చెప్పాలి
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట, నవంబర్ 12 వై సెవెన్ న్యూస్
ఉచ్ఛనీచాలు మరిచిపోయి అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలతో దాడి చేస్తున్న ఉన్మాద మూకలకు మద్దతుగా మాజీ మంత్రి , చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్త విడదల రజిని మాట్లాడటం సిగ్గుచేటని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వనర్ పెంటేల బాలాజి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ విడదల రజిని ప్రజాస్వామ్యం, చట్టాల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. వైసీపీ పాలనా కాలంలో సోషల్‌మీడియాలో ప్రశ్నించినందుకు ఎంతోమంది మహిళలపైనా కేసులుపెట్టి ఇబ్బందులకు గురిచేశారని గుర్తు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో సైతం తనను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియా యాక్టివిస్తులపై పోలీసు స్టేషన్‌లో అక్రమకేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు.
*విడుదల రజిని మీ అవినీతిపై సమాధానం చెప్పండి*
పోలీసులు, చట్టాలు గురించి మాట్లాడుతున్న విడదల రజిని తన ఐదేళ్ల పాలన కాలంలో చిలకలూరిపేటలో వ్యాపారులను భయపెట్టి, ఆమాయకులను మభ్యపెట్టి దోచుకున్న అక్రమ సంపాదనపై సమాధానం చెప్పాలని బాలాజి డిమాండ్ చేశారు. విడదల రజిని హయాంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో అంతులేని అవినీతి కొనసాగిందని వివరించారు. జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని ఊదరగొట్టిన మాజీ మంత్రి విడదల రజిని భూములను ప్రైవేట్ వ్యక్తులు, రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి గత ప్రభుత్వానికి మాత్రం మార్కెట్ కంటే రెండింతల అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు రైతులు అప్పట్లో మాజీమంత్రి రజినికి ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారని, పసుమర్రు శివారు గ్రామం గుదేవారిపాలెం రైతులు కూడా మాజీమంత్రి అనుచరులు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని యడ్లపాడు స్టోన్ క్రషర్స్ బాధితులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ప్రతి రోజు విడదల రజిని బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ చుట్టు క్యూకడుతున్నారన్నారు. తప్పుడు పనులు చేసి చట్ట ప్రకారం శిక్షార్హులుగా ఉన్న విడదల రజిని పోలీసులపై , పోలీసు వ్యవస్థపై ఆరోపణలను చేయడం శోచనీయమన్నారు.