నేపాల్‌లోని రాసువా జిల్లాను ముంచెత్తిన మెరుపు వరదలకు ముందు భూకంపం సంభవించినట్లు సమాచారం. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. ఫ్లాష్ ఫ్లడ్స్‌కు సుమారు ఏడు నిమిషాల ముందు 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూప్రకంపనల కారణంగానే చైనాలోని టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల్లో ఉన్న సుప్రాగ్లేషియల్ సరస్సు బద్ధలై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో లెహెండే ఖోలా నదిలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగి, దిగువన ఉన్న భోటేకోశి నదిలోకి భారీగా నీరు చేరడంతో ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలుస్తోంది.
టిబెట్ సరిహద్దుల్లో ఉన్న రాసువా జిల్లా ఈ వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతింది. మానస సరోవర్, గోసైంకుండ యాత్రలకు ఈ ప్రాంతం కీలక మార్గం కావడంతో వరదల సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా టిమురే, స్యాప్రుబేసి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న 400 మందికి పైగా యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 133 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భోటేకోశి నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి భీతావహంగా మారింది. వరద ఉధృతికి నది ఒడ్డున ఉన్న గ్రామాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. భూకంపం తర్వాత కేవలం ఏడు నిమిషాల్లోనే వరద విరుచుకుపడటం ఇప్పుడు ఈ విపత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది.









