రెండు ద్విచక్ర వాహనాల్లో హైదరాబాద్కు తరలిస్తుండగా నలుగురు అరెస్ట్
భద్రాచలం, జూలై 13 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 13.900 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సి.హెచ్. శ్రీహరిరావు ఆధ్వర్యంలో సిబ్బంది కూనవరం-భద్రాచలం రహదారిలోని ఇసుక రీచ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా వస్తున్న KTM 390 డ్యూక్ (OD 30 G 7886) వాహనాన్ని తనిఖీ చేయగా 6.900 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. ఈ కేసులో మల్కాన్గిరి జిల్లా, ఒడిశాకు చెందిన సుశాంకర్ బిశ్వాస్ మరియు ప్రసంజీత్ చింతపత్రలను అరెస్ట్ చేశారు.
అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ (OD 30 G 1537) వాహనాన్ని తనిఖీ చేయగా 7 కిలోల ఎండు గంజాయి స్వాధీనం అయింది. ఈ కేసులో రోహిత్ గౌడ్ మరియు అలోక్ బెహరాలను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన నలుగురు నిందితులు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న 13.900 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు కలిపి సుమారు రూ.9.05 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అహ్మద్, కానిస్టేబుళ్లు పి. రాజు, వెంకన్న, ప్రసన్నకుమార్, తిరుపతి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.









