పలాస, జూన్ 20 (వై7 న్యూస్): పలాస మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలను ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
తరగతి గదులను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, ఉపాధ్యాయుల బోధన విధానం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని హితవు పలికారు.
అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన వజ్జ బాబూరావు, భోజనశాలను సందర్శించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలుపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల ఆవరణలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక వసతులను కూడా పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
పాఠశాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, అవసరాలను ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వజ్జ బాబూరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.








