E-PAPER

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో వణికిన రష్యా.. మాస్కోలో కురిసిన ‘బ్లాక్ రెయిన్’

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్ బలగాలు రష్యా రాజధాని మాస్కోపై మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విరుచుకుపడటంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దాదాపు 200లకు పైగా లాంగ్-రేంజ్ డ్రోన్లతో మాస్కోలోని కీలకమైన చమురు శుద్ధి కర్మాగారం (ఆయిల్ రిఫైనరీ) లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. ఈ ఆకస్మిక దాడులతో రిఫైనరీలో భారీ పేలుళ్లు సంభవించి మంటలు ఎగసిపడటంతో, మాస్కో నగరమంతా దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో వందలాది విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

ఈ భారీ దాడి అనంతరం మాస్కోలో అత్యంత వింతైన, భయానక వాతావరణం నెలకొంది. చమురు శుద్ధి కేంద్రం కాలిపోవడం వల్ల వెలువడిన కాలుష్య కణాలు, బూడిద, నూనె అవశేషాలు వేల అడుగుల ఎత్తుకు చేరి మేఘాలతో కలిసిపోయాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో ‘బ్లాక్ రెయిన్’ (నల్లటి వర్షం) కురిసింది. ఆకాశం నుంచి సాధారణ నీటి చినుకులకు బదులుగా నూనె జిడ్డుతో కూడిన నల్లటి వర్షం పడటంతో రోడ్లు, కార్లు, ఇళ్లపై నల్లటి మరకలు ఏర్పడ్డాయి. బయటకు వచ్చిన ప్రజల దుస్తులపై కూడా నల్లటి మచ్చలు పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కోపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇన్నాళ్లూ సరిహద్దులకే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు నేరుగా రష్యా రాజధాని నడిబొడ్డున పర్యావరణ విపత్తును సృష్టించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గాలి కాలుష్యం మరియు ‘బ్లాక్ రెయిన్’ కారణంగా ఉబ్బసం ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు కిటికీలు మూసుకుని ఇళ్లలోనే ఉండాలని, వీలైతే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, ఈ దాడులకు ప్రతీకారంగా రష్యా కూడా కీవ్ సహా పలు ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, యుద్ధ విమానాలతో తీవ్ర స్థాయిలో ఎదురుదాడులకు దిగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!