E-PAPER

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే గౌతు శిరీష

శ్రీకాకుళం జిల్లా, పలాస | వై 7 న్యూస్ | జూన్ 15

పలాస మండలం టెక్కలిపట్నంలో రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గత పాలకులు రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించిన ఆమె, ముఖ్యంగా వంశధార జలాల వినియోగంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల అవసరాలను గుర్తించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పనిచేస్తోందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేసిన ఆమె, రైతులు అవసరానికి మించి ఎరువులు వాడకూడదని సూచించారు. అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారత తగ్గిపోతుందని, దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

యూరియాను ఎకరాకు 75 కిలోల మోతాదులో మాత్రమే వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు. భవిష్యత్ తరాల కోసం భూసారాన్ని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సేంద్రియ మరియు సహజ వ్యవసాయ పద్ధతులు రైతులకు ఆర్థికంగా కూడా లాభదాయకమని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ద్వారా సబ్సిడీలు పారదర్శకంగా అందుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీను, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు వంకల కుర్మారావు, వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!