భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం, పినపాక మండలంలో శ్రీ గిరిలక్ష్మి సొసైటీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి మాట్లాడుతూ, రెండు సొసైటీల మధ్య నెలకొన్న వివాదం మరియు ఇసుక ర్యాంపు కేటాయింపు అంశంలో స్థానిక సర్పంచ్, గ్రామ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు గ్రామాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ వివాదం వెనుక కొంతమంది పెద్ద కాంట్రాక్టర్లు, గిరిజనేతర వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. తప్పు చేసిన గ్రామ కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే సర్పంచ్ అధికారాలను రద్దు చేసే దిశగా జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గత రెండు రోజులుగా 40 డిగ్రీలకుపైగా ఎండలను సైతం లెక్కచేయకుండా తమ వ్యక్తిగత పనులను పక్కనపెట్టి దీక్షలో పాల్గొంటున్న శ్రీ గిరిలక్ష్మి సొసైటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఉమ్మడి సొసైటీలో సభ్యులకు రావలసిన సుమారు రూ.40 లక్షల బోనస్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీ గిరిలక్ష్మి సొసైటీకి ఇసుక ర్యాంపును కేటాయించి, వారి జీవనోపాధిని కాపాడాలని కోరారు.
సంబంధిత ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు దశలవారీగా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని తెలిపారు.








