శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వరుస దొంగతనాల కేసులను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.80 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి సోమవారం వెల్లడించారు.
అరెస్టు కాబడిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాకు చెందిన మహమ్మద్ మీజాన్ (36), మహమ్మద్ హసన్ (26). ప్రధాన నిందితుడు మహమ్మద్ మీజాన్ పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తేలింది.
నిందితుడు మీజాన్‌పై గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. జైలు శిక్ష అనుభవించిన అనంతరం విడుదలై మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు పలాస మండలం గరుడఖండి జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,09,350 నగదు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాశీబుగ్గ, టెక్కలి, పార్వతీపురం, బరంపురం ప్రాంతాల్లో నమోదైన పలు దొంగతనాల కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.








