అశ్వరావుపేట, ఏప్రిల్ 23 (Y7 న్యూస్):
మారప్పగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో అక్రమ కలప రవాణాపై అటవీ శాఖ సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. తీవ్ర ఎండల మధ్య కూడా అక్రమార్కులు కలప తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు దాడి నిర్వహించారు.
సుమారు 42–43 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ తన బృందంతో కలిసి అక్రమంగా కలప తరలిస్తున్న ముఠాపై దాడి చేశారు. అధికారులు రావడం గమనించిన కొందరు కూలీలు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.దాడిలో భాగంగా ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్రమంగా కలప రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, అటవీ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రేంజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ,
“అటవీ ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చట్టరీత్య చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.ఎండ తీవ్రతను కూడా పట్టించుకోకుండా అక్రమ దందా కొనసాగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారులు చర్యలు కఠినతరం చేయడంతో అక్రమార్కులపై నిఘా పెంచారు.









