వై 7 న్యూస్ తెలుగు
రూ.10 లక్షల బిల్లు పాస్‌కు రూ.30 వేల డిమాండ్
నల్గొండ జిల్లా దేవరకొండలో అవినీతి అధికారిపై ఏసీబీ ఉచ్చుపడింది. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ)గా పనిచేస్తున్న సిరికొండ సైదులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు.
వివరాల్లోకి వెళితే… కంబాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వచ్చిన గాలివాన వల్ల దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ కాంట్రాక్టర్ మరమ్మతు చేశాడు. ఈ పనులకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు ఏడీఈ సైదులు రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్నారు. ఏప్రిల్ 16న దేవరకొండలోని తన కార్యాలయంలో లంచం డబ్బులు స్వీకరిస్తుండగా సైదులును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.
అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో అవినీతి మరోసారి బహిర్గతమైంది.








