ఖమ్మం, 10 ఏప్రిల్ 2026:
జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఖమ్మం పోలీస్ యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ… ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల పరిసరాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక, గంజాయి, రేషన్ బియ్యం వంటి వాటిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక లారీలపై కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రవాణా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
దొంగతనాలను అరికట్టేందుకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయని, అనుమానిత వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే పూర్తి వివరాలు సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.








