వై 7 న్యూస్ పలాస
శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇప్పిలి సంజనకు రాష్ట్రపతితో విందు చేసే అరుదైన అవకాశం లభించింది.
ఈ విషయాన్ని శుక్రవారం పాఠశాలలో జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు సుజాత వెల్లడించారు. సంజన గత మూడు సంవత్సరాలుగా సైన్స్ ఆధారిత వినూత్న ప్రాజెక్టులను తయారు చేస్తూ, వాటిని అటల్ ఇన్నోవేషన్ మిషన్కు పంపిస్తున్నట్లు తెలిపారు.
సంజన రూపొందించిన డ్యూయల్ సోలార్ ట్రాకర్ సిస్టమ్ ప్రాజెక్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అధికారులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థినిలోని సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలకు గుర్తింపుగా ఆమెకు ఈ గౌరవనీయ ఆహ్వానం అందినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఈ అవకాశం రావడం పాఠశాలకే కాకుండా, జిల్లా మొత్తానికి గర్వకారణంగా నిలిచింది.









