త్వరలో సీఎం దృష్టికి సమస్య రేణుక అక్షర మహిళా మండలి
మణుగూరు, ఆగస్టు 26 (వై 7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముంపు సమస్య తీవ్రంగా తలెత్తుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది మణుగూరు ముంపుకు గురికాకుండా చేపట్టిన పూడికతీత పనుల్లో భారీ అవినీతి జరిగిందని రేణుక అక్షర మహిళా మండలి ఆరోపించింది.
మహిళా మండలి అధ్యక్షురాలు పూణెం సరోజ మాట్లాడుతూ “కాల్వల పూడికతీత పేరుతో నిధులు కేటాయించినా, పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. కొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే బిల్లులు క్లియర్ చేశారు. మూడు సంవత్సరాలుగా తాత్కాలిక చర్యలకే పరిమితమై, శాశ్వత పరిష్కారం లేకుండా మళ్లీ మళ్లీ కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా మౌనం వహించడం ఆశ్చర్యకరం” అని విమర్శించారు.
ఈ అంశంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గారిని కలిసి సమస్యను వివరించామని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా పూర్తి వివరాలను అందజేస్తామని తెలిపారు. “మణుగూరును ముంపు నుంచి కాపాడుకోవడం కోసం శాశ్వత చర్యలు తీసుకోవాలి. అవినీతి చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం” అని పూణెం సరోజ హెచ్చరించారు









