కేటి దొడ్డి, మే 28 (వై 7 న్యూస్ ప్రతినిధి):
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని పాత పాలెం గ్రామంలో బుధవారం రుతు పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి రెడ్డి సునంద మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం మే 28న రుతు పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా మహిళల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా తీసుకుంటారు. యుక్త వయస్సు బాలికలకు నెలసరి అనేది ఒక సహజ ప్రక్రియ. అయితే దీనికి సంబంధించిన పరిశుభ్రతపై అవగాహన లోపం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి,” అని తెలిపారు.
“ఋతుక్రమ సమయంలో శుభ్రత పాటించకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కనీసం 8 గంటలకోసారి శానిటరీ ప్యాడ్ మార్చుకోవడం చాలా అవసరం. ఇంకా కొన్నిచోట్ల నెలసరి సమయంలో ఉన్న ఆడవారిని అంటరాని వారిలా చూడటం, సామాజికంగా వేరు పెట్టడం వంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది,” అని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమ అనంతరం శానిటరీ ప్యాడ్స్, స్నాక్స్ పంపిణీ చేయగా, అనంతరం సమ్మర్ రేమిడియల్ సెంటర్‌ను సందర్శించారు. హాజరు శాతం, పోర్టు పోలియో, ప్రాజెక్ట్ వర్క్స్ పైన సమీక్ష చేశారు. పిల్లలు వేసవి సెలవుల్లో నేర్చుకునే యాక్టివిటీల ద్వారా తమ సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా కిశోర బాలికలు రవాణా సౌకర్యం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కేజీవీబీ హాస్టల్ సీట్ల విషయమై పిటిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి నరసింహ, మెడికల్ ఆఫీసర్ సామ్రిన్, చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ జయన్న, సూపర్వైజర్ నవీన్, ఏఎన్ఎం ఊర్మిళా దేవి, ఎం.బి.ఎఫ్ మండల్ ఇంచార్జ్ కిరణ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ రామాంజనేయులు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్థులు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.









