ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి గుజరాత్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరిని ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14 కిలోల గంజాయితో పాటు సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చండిపిత గ్రామానికి చెందిన రీనా పరిడా, సిటు ప్రధాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఒడిశాకు చెందిన గంజాయి వ్యాపారి లక్ష్మీకాంత్ గౌడ వద్ద 14 కిలోల గంజాయిని తీసుకున్నారు. శుక్రవారం వ్యాపారి అందించిన ద్విచక్ర వాహనంపై గంజాయితో ఇచ్ఛాపురం చేరుకున్నారు.

అనంతరం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లేందుకు రైలు ఎక్కే క్రమంలో, ఇచ్ఛాపురం పట్టణ ఇన్‌చార్జి ఎస్‌ఐ జనార్దనరావు తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో వారి వద్ద 14 కిలోల గంజాయి లభించడంతో పాటు ఒక సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
— Y7 News Telugu | శ్రీకాకుళం జిల్లా, పలాస









