ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల గోప్యతకు పెద్దపీట వేస్తూ మరో కీలకమైన ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలు, వీడియోలు, వాయిస్ నోట్స్‌కు మాత్రమే పరిమితమైన ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్‌లకు కూడా విస్తరిస్తోంది. అత్యంత సున్నితమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు అదనపు భద్రత కల్పించడమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం.
ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త ఫీచర్ సాయంతో పంపిన టెక్స్ట్ మెసేజ్‌ను అవతలి వారు ఒక్కసారి మాత్రమే తెరిచి చదవగలరు. ఆ విండోను మూసివేసిన వెంటనే ఆ మెసేజ్ చాట్ నుంచి శాశ్వతంగా మాయమవుతుంది. దాన్ని మళ్లీ చూడటానికి ఎలాంటి అవకాశం ఉండదు. మెసేజ్ టైప్ చేశాక, ‘సెండ్’ బటన్‌ను నొక్కి పట్టుకుంటే ‘వ్యూ వన్స్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోగానే మెసేజ్ ప్రత్యేక రీతిలో సెండ్ అవుతుంది. అవతలి వ్యక్తి ఆ సందేశాన్ని చదివిన తర్వాత, దాని స్థానంలో “ఓపెన్డ్” అని మాత్రమే కనిపిస్తుంది.
భద్రత, గోప్యతకు పెద్దపీట
ఈ ఫీచర్‌కు వాట్సప్ అదనపు భద్రతా చర్యలు జోడించింది. ‘వ్యూ వన్స్’ మోడ్‌లో పంపిన టెక్స్ట్ మెసేజ్ ఓపెన్‌లో ఉన్నప్పుడు స్క్రీన్‌షాట్ తీయడం గానీ, స్క్రీన్ రికార్డింగ్ చేయడం గానీ సాధ్యపడదు. అంతేకాకుండా, ఆ మెసేజ్‌ను కాపీ చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా సేవ్ చేసుకోవడం వంటి ఆప్షన్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ఉన్న డిసప్పియరింగ్ మెసేజ్‌లు నిర్ణీత సమయం (24 గంటలు, 7 రోజులు, 90 రోజులు) తర్వాత అదృశ్యమవుతాయి. కానీ, ‘వ్యూ వన్స్’ టెక్స్ట్ మాత్రం చదివి మూసివేయగానే తక్షణం మాయమవుతుంది.
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లలో ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. పరీక్షలు పూర్తయ్యాక, స్థిరమైన వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ దశలవారీగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, యాప్ స్థాయిలో స్క్రీన్‌షాట్‌ను నిరోధించినా, ఎవరైనా మరో ఫోన్‌తో స్క్రీన్‌ను ఫొటో తీసే ప్రమాదం ఉంటుందని, కాబట్టి యూజర్లు సున్నితమైన సమాచారాన్ని పంపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.








