E-PAPER

అంత్యక్రియల ప్యాకేజీలతో ఢిల్లీ స్టార్టప్..! నలుగురు భుజాలు కూడా అద్దెకే..

సాధారణంగా జీవితంలో పెళ్లిళ్లు, ఇళ్ల కొనుగోళ్లు లేదా విహారయాత్రలకు ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం సహజం. అయితే మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే అంత్యక్రియలకు కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చని చెబుతోంది ఢిల్లీకి చెందిన ఒక సరికొత్త స్టార్టప్. పాడె మోసే నలుగురు వ్యక్తుల నుంచి పూజారులు, దహన సంస్కారాలు, అస్థికల నిమజ్జనం వరకు సమస్త బాధ్యతలను భుజానకెత్తుకుంటూ ప్యాకేజీలను అందిస్తోంది. బతికుండగానే తమ అంతిమ సంస్కారాలను ముందస్తుగా బుక్ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పిస్తూ నెట్టింట సరికొత్త చర్చకు తెరలేపింది.

‘నమో గంగే వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘మోక్ష వాయేజ్’ అనే భారతీయ స్టార్టప్ ఈ వినూత్న సేవలను ప్రారంభించింది. ఒక వ్యక్తి మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోయే కుటుంబసభ్యులపై లాజిస్టిక్స్ భారం పడకుండా, సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగేలా చూడటమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. హిందూ సంప్రదాయాల ప్రకారం పాడె మోసేందుకు నలుగురు వ్యక్తులను ఏర్పాటు చేయడం, శవవాహనం సమకూర్చడం, కట్టెలు, పూలు, పూజా సామగ్రిని తీసుకురావడం వంటి సేవలన్నీ వీరు సమకూరుస్తారు. అంతేకాకుండా పురోహితుల రాక, దహన సంస్కారాల అనంతరం అస్థికల సేకరణ, ఘాట్ వద్ద బోటు ఏర్పాటు చేసి నిమజ్జనం పూర్తి చేయడం, శ్రాద్ధ కర్మల నిర్వహణ వరకు ప్రతి అంచెలోనూ సహాయం అందిస్తున్నారు.

ఈ సేవలకు సంబంధించి కనీసం రూ.6,000 నుంచి గరిష్ఠంగా దాదాపు రూ.1.5 లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకునే సేవల ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ స్టార్టప్ కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్‌లో కూడా ఈ సంస్థ స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కష్ట సమయంలో బంధువులకు శ్రమ తగ్గించే ప్రాక్టికల్ ఆలోచన అని కొందరు ప్రశంసిస్తుంటే.. అంతిమ సంస్కారాలను, మరణాన్ని కూడా వ్యాపారీకరణ చేస్తున్నారంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!