E-PAPER

పినపాక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు.. పీసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సీనియర్ల సన్నాహాలు!

పినపాక, వై7 న్యూస్ తెలుగు:
పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తల అసంతృప్తి తీవ్రస్థాయికి చేరుకుంటోంది. పార్టీ కోసం పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడిన తమను విస్మరించి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గెలిచిన తర్వాత పార్టీ సీనియర్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడంపై స్థానిక కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ సభ్యత్వం, సీనియారిటీ లేని వారికి పదవులు ఇస్తూ, దశాబ్ద కాలంగా జెండా మోసిన వారిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా సీనియర్ కార్యకర్తలకు కనీసం ఇందిరమ్మ ఇళ్లు గానీ, ఇతర ప్రభుత్వ పథకాలు గానీ అందడం లేదని, దరఖాస్తులు తీసుకుంటున్నారే తప్ప పనులు చేయడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, కొత్తగా వచ్చిన వారు భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎటు వెళ్తే అటే వెళ్తామని బహిరంగంగా చెబుతుండటం పార్టీకి నష్టం కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలోని సుమారు 50 నుండి 60 మంది సీనియర్ కార్యకర్తలతో కలిసి నేరుగా పీసీసీ (PCC) పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ ఇచ్చే స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!