చలికాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ, ఇదే సమయంలో గుండె ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గేకొద్దీ గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న శారీరక కారణాలు, గుర్తించాల్సిన ముందస్తు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం..
శరీరంలో ఏం జరుగుతుంది?
ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనిని వైద్య పరిభాషలో ‘వాసోకన్‌స్ట్రిక్షన్’ అంటారు. రక్తనాళాలు సన్నబడటం వల్ల రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. దీంతో గుండె రక్తాన్ని సరఫరా చేయడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.
అంతేకాకుండా, చలికి రక్తం చిక్కబడి రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో దాహం తక్కువగా వేయడంతో నీరు తక్కువగా తాగుతారు. డీహైడ్రేషన్, శారీరక శ్రమ తగ్గడం, సీజనల్ ఫ్లూ లేదా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కూడా గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారిలో ఇది మరింత ప్రభావం చూపుతుంది.
నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక సంకేతాలు
గుండెపోటు ఎప్పుడూ ఛాతీలో తీవ్రమైన నొప్పితోనే మొదలవుతుందనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు అది చిన్న అసౌకర్యంగా కనిపించవచ్చు. ఛాతీ మధ్యలో ఒత్తిడి, పట్టేసినట్లు లేదా బరువుగా అనిపించడం…ఆ నొప్పి ఎడమ చేతికి, భుజాలకు, మెడ, దవడ లేదా వెన్నుభాగానికి వ్యాపిస్తే జాగ్రత్త పడాలి. ఎలాంటి శ్రమ చేయకపోయినా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే అలర్ట్ కావాలి.
చలి వాతావరణంలోనూ అకారణంగా చెమటలు పట్టడం, తల తిరిగినా జాగ్రత్త పడాల్సిందే. తీవ్రమైన అలసట, నీరసం లేదా వికారం ఉంటే అనుమానించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, డయాబెటిస్ బాధితుల్లో స్పష్టమైన ఛాతీ నొప్పి లేకుండా కేవలం తీవ్రమైన అలసట, గ్యాస్ లేదా ఎసిడిటీలాంటి అసౌకర్యం రూపంలోనూ లక్షణాలు బయటపడవచ్చు. వీటిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి ఉపేక్షించకూడదు.
పాటించాల్సిన జాగ్రత్తలు
ఉదయాన్నే విపరీతమైన చలి ఉన్నప్పుడు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లకుండా, కాస్త ఎండ వచ్చిన తర్వాతే నడక ప్రారంభించడం మంచిది. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులు ధరించి శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. రోజువారీగా తగినంత గోరువెచ్చని నీరు తాగుతూ శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. నూనెలు, కొవ్వు పదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ రోగులు తమ మందులను క్రమం తప్పకుండా వాడుతూ, వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. చలికాలంలో గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం, శరీర సంకేతాలను సకాలంలో గుర్తించి వైద్యులను సంప్రదించడమే అత్యుత్తమ రక్షణ కవచం.








