E-PAPER

యూపీఐ ఛార్జీలు జనవరికి వాయిదా..? వాయిదా ఎందుకంటే..?

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే భారీ విలువ గల లావాదేవీలపై ప్రతిపాదించిన రుసుము అమలును కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం రుసుమును అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతిపాదించింది. అయితే, ఈ గడువును వచ్చే ఏడాది జనవరి వరకు పొడిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను ఆధునికీకరించుకోవడానికి సమయం దొరకడమే కాకుండా, పండగ సీజన్‌లో వ్యాపారులపై అదనపు ఛార్జీల భారం పడకుండా ఉంటుందని అంచనా.

ఆరేళ్లకు పైగా ఎలాంటి రుసుము లేకుండా కొనసాగుతున్న యూపీఐ చెల్లింపులపై ఈ ఛార్జీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇది వినియోగదారులకు ప్రత్యక్షంగా వర్తించదు. ఇది వ్యాపారుల వైపు నుంచి చెల్లించాల్సిన ఇంటర్‌ఛేంజ్ రుసుము. ప్రస్తుతం దేశంలో 50 కోట్లకు పైగా యూపీఐ వినియోగదారులు ఉన్నారు. ఆగస్టు 2026 నెలలోనే యూపీఐ ద్వారా రూ. 29.82 లక్షల కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయంటే దీని ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు.

వాయిదా ఎందుకు?

అక్టోబర్ 15 నుంచి ఛార్జీల అమలు మొదలుపెడితే, అది దసరా, దీపావళి వంటి పండగల సమయంలో వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో రిటైల్ చెల్లింపులకు అంతరాయం కలగకుండా చూడాలనేది ప్రధాన ఉద్దేశం. అదే సమయంలో, ఈ అదనపు గడువులో పేమెంట్ కంపెనీలు తమ సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరుచుకోవడానికి, ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా ఎలా సర్దుబాటు చేయాలో ప్రణాళిక రచించుకోవడానికి సమయం లభిస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!