లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్ 3’ నుంచి మేకర్స్ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకుంది. “సేనాపతి జీరో టాలరెన్స్‌తో తిరిగి వస్తున్నారు. ‘ఇండియన్ 3’ వార్ మోడ్‌లో పునరుజ్జీవనం” అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
వాస్తవానికి ‘ఇండియన్ 2’ చిత్రీకరణ సమయంలోనే మూడో భాగానికి సంబంధించిన కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉండటంతో కథను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు శంకర్, కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇండియన్ 2’ కంటే మూడో భాగంపైనే తనకు ఎక్కువ ఆసక్తి ఉందని కమల్ హాసన్ గతంలోనే స్పష్టం చేశారు.
1996లో వచ్చిన ‘ఇండియన్’ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ను 2017లో ప్రకటించారు. అయితే, ఈ సినిమా ప్రయాణం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. సెట్స్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మరణించడం, ఆ తర్వాత కరోనా మహమ్మారి, దర్శక-నిర్మాతల మధ్య విభేదాల కారణంగా షూటింగ్ చాలాకాలం నిలిచిపోయింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు శంకర్, కమల్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ ఆర్థిక సహాయం ప్రకటించింది.
అనంతరం రెడ్ జెయింట్ మూవీస్ రంగంలోకి దిగడంతో వివాదాలు పరిష్కారమై, చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఎట్టకేలకు ‘ఇండియన్ 2’ పూర్తి చేశారు. ఆ సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ‘ఇండియన్ 3’కి సంబంధించిన తాజా పోస్టర్ రావడంతో ఫ్రాంచైజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవినీతిపై సేనాపతి చేసే యుద్ధాన్ని మరోసారి తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








