E-PAPER

టాక్సిక్‌కు షాకింగ్ రెస్పాన్స్.. ఇంగ్లీష్ వెర్షన్ వారం రోజుల్లో రూ.3.16 లక్షలే

‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం, యష్ క్రేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుందని భావించారు. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోగా, ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి. యష్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో విడుదల చేశారు.

సెప్టెంబర్ 4న ఎంపిక చేసిన నగరాల్లో విడుదలైన ఇంగ్లీష్ వెర్షన్‌కు మొదటి వారంలో కేవలం రూ.3.16 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. తొలి రోజు 11 షోల ద్వారా రూ.1.38 లక్షలు రాగా, శనివారం రూ.78,774, ఆదివారం రూ.70,460 వసూలయ్యాయి. సోమవారం నుంచి కలెక్షన్లు మరింత తగ్గిపోయాయి. మంగళవారం రూ.3,125, బుధవారం రూ.5,699, గురువారం రూ.4,655 మాత్రమే వచ్చాయి. దీంతో వారం మొత్తం వసూళ్లు రూ.3,16,042 వద్దే నిలిచిపోయాయి. ప్రేక్షకుల స్పందన లేకపోవడంతో సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంగ్లీష్ వెర్షన్‌ను పూర్తిగా నిలిపివేశారు.

ఇక ఇంగ్లీష్ వెర్షన్ రన్‌టైమ్ కూడా ఇతర భాషల వెర్షన్లతో పోలిస్తే తక్కువగా ఉండటం మరో ప్రత్యేకత. ఇంగ్లీష్ ఎడిషన్ నిడివి 2 గంటల 56 నిమిషాలు కాగా, మిగతా వెర్షన్ల రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలుగా ఉంది. కథను కొంత కుదించి అందించినప్పటికీ అది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు ఇప్పుడు సినిమాకు ఎదురైన అతిపెద్ద నిరాశల్లో ఒకటిగా నిలిచాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!