E-PAPER

రష్యాపై ఆంక్షలపై పుతిన్ ఫైర్.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు

పాశ్చాత్య దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తీవ్రంగా స్పందించారు. న్యూఢిల్లీలో జరిగిన BRICS బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సెషన్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాలపై విధించిన ఆంక్షలన్నింటినీ కలిపినా, వాటికి రెట్టింపు స్థాయిలో రష్యాపైనే 30 వేలకు పైగా ఆంక్షలు విధించారని అన్నారు. అంతర్జాతీయ వ్యాపారంలో పోటీని కొన్ని దేశాలు ప్రభుత్వాల స్థాయిలోనే ప్రభావితం చేస్తున్నాయని విమర్శించారు. గ్యాస్ పైప్‌లైన్ల ధ్వంసం, అంతర్జాతీయ రవాణా మార్గాల మూసివేత, నౌకల స్వాధీనం, ద్వితీయ శ్రేణి ఆంక్షల పేరుతో ఇతర దేశాలపై ఒత్తిడి వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే ఆంక్షల ప్రభావాన్ని రష్యా సమర్థంగా ఎదుర్కొందని, విశ్వసనీయ భాగస్వామ్య దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించి జాతీయ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసుకున్నామని పుతిన్ పేర్కొన్నారు.

మరోవైపు రష్యా నుంచి భారత్, చైనా వంటి దేశాలు క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడంపై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. రష్యా, ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించిన అమెరికా సెనెట్ బిల్లులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అధిక సుంకాలు విధించే అవకాశం కల్పించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. దేశ జాతీయ ప్రయోజనాలు, ప్రజల ఇంధన అవసరాలే తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. అమెరికాతో సహా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే ఇంధన భద్రతను కాపాడుకోవడం భారత్ విధానమని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎప్పుడూ ముందుంటుందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ పేర్కొన్నారు. భారత్‌కు అవసరమైనంత చమురు సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, 18వ BRICS శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బిష్కెక్‌లో జరిగిన SCO సదస్సు తర్వాత రెండు వారాల వ్యవధిలోనే ఇరువురు నేతలు సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ భేటీలో ‘ఎకనామిక్ కోఆపరేషన్ 2030’ కార్యక్రమం అమలు, మౌలిక వసతులు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించినట్లు సమాచారం.:::

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!