చాలామంది చెవుల్లో పేరుకుపోయే గూబిలిని మురికిగా భావించి తరచుగా శుభ్రం చేసుకుంటుంటారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. చెవిలోని గూబిలిని తరచుగా తొలగించే అలవాటు చెవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వైద్య పరిభాషలో దీనిని ‘సెరుమెన్’ అంటారు. చెవి కాలువలోని గ్రంథులు సహజంగానే సెరుమెన్ను ఉత్పత్తి చేస్తాయి.
చెవి గూబిలి నిజానికి చెవికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు, చిన్న పురుగులు చెవి లోపలికి చేరకుండా అడ్డుకోవడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా చెవి కాలువలోని చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. అందువల్ల సాధారణంగా చెవి గూబిలి ఉండటం ఆరోగ్య సమస్యగా భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇయర్‌బడ్స్, పిన్నులు లేదా ఇతర పదునైన వస్తువులతో చెవిని శుభ్రం చేయడం వల్ల గూబిలి మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో చెవి కాలువకు గాయం కావడం లేదా ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చెవిలో గూబిలి అధికంగా పేరుకుపోయి వినికిడి తగ్గడం, నొప్పి లేదా ఇతర అసౌకర్యం ఉంటే స్వయంగా శుభ్రం చేసుకోవడం కంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.








