E-PAPER

పలాసలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం

పలాస, సెప్టెంబర్ 12 (వై 7 న్యూస్):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో పలాస శివాజీనగర్‌లో శనివారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ శ్రీధర్ బాబా పాల్గొని భక్తులకు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి కేవలం పండుగ మాత్రమే కాదని, మనిషికి, మట్టికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే సనాతన సంప్రదాయమని అన్నారు. పూర్వకాలంలో సహజమైన మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజించే ఆచారం ఉండేదని తెలిపారు.

వినాయక పూజలో 21 రకాల పత్రాలతో నిర్వహించే ఏకవింశతి పత్ర పూజ మన పూర్వీకులకు వృక్ష సంపద, ఔషధ గుణాలు, ప్రకృతి పరిరక్షణపై ఉన్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు.

ప్రకృతి నుంచి తీసుకున్న మట్టితో విగ్రహాన్ని తయారు చేసి, పూజ అనంతరం తిరిగి ప్రకృతిలో కలపడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడే సందేశం మన సంప్రదాయంలో ఉందన్నారు. అయితే ప్రస్తుతం రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వినియోగం పెరగడంతో చెరువులు, కాలువలు, నదులు కలుషితమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పలాస యువతతో పాటు ప్రజలందరూ పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తితో పాటు సామాజిక, పర్యావరణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు.

“మట్టి వినాయకుడినే పూజిద్దాం.. మన సనాతన సంప్రదాయాన్ని కాపాడుకుందాం.. మన పలాస ప్రకృతిని కంటికి రెప్పలా పరిరక్షించుకుందాం” అని దువ్వాడ శ్రీధర్ బాబా అన్నారు.

శ్రీ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!