బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమ మద్యం రవాణా ఆగడం లేదు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ముఠాలు యువతులను సైతం ఉపయోగిస్తున్నట్లు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పట్నాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రియా అనే యువతి మద్యం సీసాలతో పట్టుబడటం కలకలం రేపింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పట్నా జంక్షన్ పరిసర ప్రాంతాలకు అక్రమ మద్యం సరఫరా కానున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెంచారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న రియాను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, ఆమె హ్యాండ్‌బ్యాగ్, షోల్డర్ బ్యాగ్‌లలో సుమారు రూ.14 వేల విలువైన అర డజనుకు పైగా విదేశీ బ్రాండ్ మద్యం సీసాలు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది.
సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తనకు తెలిసిన ఓ యువకుడి మాటలు నమ్మి ఉత్తరప్రదేశ్ నుంచి రైలులో మద్యం తీసుకొచ్చినట్లు రియా పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇదే మొదటిసారి ఈ పనికి పాల్పడ్డానని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం రియాను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిన యువకుడి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం ఎవరికి అందజేయాల్సి ఉంది, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది.









