E-PAPER

ఐదు గ్రామపంచాయతీలపై బండి సంజయ్‌కు వినతి

భద్రాచలం, సెప్టెంబర్ 9 (వై7 న్యూస్ తెలుగు):
ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మండలంలో కలపాలని కోరుతూ భద్రాచలం కాంగ్రెస్ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర పెఱిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఏటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల, పిచుకలపాడు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలం మండలం పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

ఈ ఐదు గ్రామపంచాయతీల సర్పంచ్‌లతో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానాలు చేయించి, ఆ తీర్మానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అవకాశం కల్పించాలని బండి సంజయ్‌ను కోరారు.

విలీనం అనంతరం ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలనా సమస్యలు, అభివృద్ధి లోపాలు, ప్రభుత్వ సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను నాయకులు మంత్రికి వివరించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐదు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో విలీనం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై బండి సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఈ అంశంపై తగిన విధంగా కృషి చేస్తామని, భద్రాచలం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతిరేల రవికుమార్, రత్నం రమాకాంత్, వెంకట్ రెడ్డి, తిరుపతి రావు, చిట్టిబాబు, నర్రా రాము, గాడి విజయ్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!