33 పతకాలు కైవసం.. క్రీడాకారులకు అభినందనలు
శ్రీకాకుళం, వై7 న్యూస్:
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ సత్తా చాటింది. గుంటూరులోని మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026లో శ్రీకాకుళం జిల్లా పోలీస్ క్రీడాకారులు ఏకంగా 33 పతకాలు సాధించారు.
15 క్రీడా విభాగాల్లో నిర్వహించిన ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో సుమారు 1,900 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా పోలీసులు 18 స్వర్ణ, 9 రజత, 6 కాంస్య పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.
పతకాలు సాధించిన శ్రీకాకుళం జిల్లా పోలీస్ క్రీడాకారులను, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం విశాఖపట్నంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు గుర్తింపు తీసుకురావడంపై క్రీడాకారులను ప్రశంసించారు.
కాగా, ఈ క్రీడా పోటీలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం పోలీసులు కైవసం చేసుకున్నారు. కాగా 33 పతకాలతో శ్రీకాకుళం జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో తమ క్రీడా ప్రతిభను చాటడం విశేషంగా నిలిచింది.








