38 కిలోల నాణ్యత లేని ఆహార పదార్థాలు డిస్కార్డ్.. 7 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు
భద్రాచలం, సెప్టెంబర్ 10 (వై7 న్యూస్ తెలుగు): భద్రాచలంలోని రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఈ. శరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మొత్తం 12 రెస్టారెంట్లను అధికారులు పరిశీలించారు. ఆహార భద్రతా నిబంధనలు పాటించడంలో లోపాలు గుర్తించిన 7 రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
తనిఖీల సందర్భంగా నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా లేని 15 కిలోల గ్రేవీ, 20 కిలోల మాంసం, 3 కిలోల మసాలా పేస్ట్ సహా మొత్తం 38 కిలోల ఆహార పదార్థాలను అధికారులు డిస్కార్డ్ చేశారు.
లోపాలను సరిదిద్దుకునేందుకు సంబంధిత రెస్టారెంట్ల యాజమాన్యాలకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయడం, వంట ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడం, నాణ్యమైన ముడి పదార్థాలను వినియోగించడం, FSSAI నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.








