భద్రాచలం, సెప్టెంబర్ 9 (వై7 న్యూస్): గతంలో భద్రాచలం మండల పరిధిలో ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మండలంలో విలీనం చేయాలని కోరుతూ భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మంత్రిని కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల, పిచుకలపాడు గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో కలిపేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల సమన్వయంతో ఆయా గ్రామపంచాయతీల సర్పంచ్‌ల నుంచి ఏకగ్రీవ తీర్మానాలు తీసుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతిపత్రం సమర్పించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న పరిపాలనా ఇబ్బందులు, అభివృద్ధి సమస్యలు, ప్రభుత్వ సేవల అందుబాటులో ఉన్న లోపాలను మంత్రికి వివరించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ గ్రామపంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో విలీనం చేసే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
వినతిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, సమస్యను పరిశీలించి తగిన స్థాయిలో కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతిరేల రవికుమార్, రత్నం రమాకాంత్, వెంకట్ రెడ్డి, తిరుపతి రావు, చిట్టిబాబు, నర్రా రాము, గాడి విజయ్, గౌతమ్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.









