శ్రీకాకుళం జిల్లా పలాస, సెప్టెంబర్ 8 (వై7 న్యూస్):
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో పలాసలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వేగులాడ దుర్గారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జనసైనికులు పెద్ద ఎత్తున తరలివచ్చి నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ దుర్గారావుతో పాటు పలాస జనసేన నాయకులు నందిగాం ధర్మారావు, దువ్వాడ వంశీ చౌదరి, సర్పవరపు ప్రదీప్, గుజ్జు దేవరాజు, వీర మహిళ దివ్య తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు “జనసేన పార్టీ జిందాబాద్”, “పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలతో సందడి చేశారు.
అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి డాక్టర్ వేగులాడ దుర్గారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతోందన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, సేవా దృక్పథం యువతను ఆకర్షిస్తున్నాయని, దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని స్థాయిలో యువత జనసేనతో మమేకమవుతోందని పేర్కొన్నారు.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజల సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతంలో ఆసుపత్రులు, డయాలసిస్ కేంద్రాలు, రక్షిత మంచినీటి సరఫరా, పింఛన్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు పేర్కొన్న ఆయన, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన-తెలుగుదేశం-బీజేపీ కూటమి ఉమ్మడిగా పోటీ చేసి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.









