ఉక్రెయిన్ సంక్షోభం వేళ రష్యా, ఉత్తర కొరియా మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రెండు దేశాల సరిహద్దులోని తుమెన్ నదిపై నిర్మించిన తొలి రహదారి వంతెన అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు రైల్వే మార్గం, విమాన సర్వీసులపై ఆధారపడిన ఇరు దేశాల మధ్య రహదారి రవాణాకు ఇప్పుడు కొత్త మార్గం ఏర్పడింది.
ఈ వంతెనతో రష్యా–ఉత్తర కొరియా మధ్య వాణిజ్యం, ప్రయాణాలు, పర్యాటకం, సాంస్కృతిక సంబంధాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయా దేశాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ద్వైపాక్షిక సంబంధాలకు ఇది మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.
అయితే ఈ వంతెన నిర్మాణం వెనుక కేవలం వాణిజ్య ప్రయోజనాలే కాకుండా వ్యూహాత్మక, సైనిక ప్రయోజనాలు కూడా ఉండొచ్చనే విశ్లేషణలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. రష్యా–ఉత్తర కొరియా మధ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ కొత్త రహదారి అనుసంధానం భవిష్యత్తులో ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.








