గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఆర్కిటిక్ ప్రాంతంలోని శాశ్వత మంచు పొరలు వేగంగా కరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర అర్ధగోళంలో దాదాపు 24 శాతం భూభాగంలో కనిపించే ఈ శాశ్వతంగా గడ్డకట్టిన నేలను ‘పెర్మాఫ్రాస్ట్’ అంటారు. కనీసం రెండేళ్ల పాటు గడ్డకట్టిన స్థితిలో ఉండే ఈ నేల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ క్రమంగా కరిగిపోతోంది.
పెర్మాఫ్రాస్ట్ కరగడం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని.. భారీ మౌలిక సదుపాయాలకు కూడా తీవ్ర ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేలలోని మంచు కరిగినప్పుడు భూమి స్థిరత్వం తగ్గి, భవనాలు, రహదారులు, పైప్‌లైన్లు వంటి నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలకు పునాదుల స్థిరత్వం కోల్పోయే అవకాశం ఉండటంతో ఆస్తి నష్టం భారీగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ శతాబ్దం మధ్య నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో పెర్మాఫ్రాస్ట్ కరగడం వల్ల సంభవించే మౌలిక సదుపాయాల నష్టం సుమారు రూ.21.66 లక్షల కోట్లు ఉండొచ్చని తాజా అధ్యయనం అంచనా వేసింది. గతంలో ఈ నష్టాన్ని సుమారు రూ.9.13 లక్షల కోట్లుగా అంచనా వేయగా.. తాజా లెక్కలు ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు సూచిస్తున్నాయి. దీంతో మంచు కింద దాగి ఉన్న ఈ ముప్పును ఎదుర్కోవడం ప్రపంచానికి పెద్ద సవాలుగా మారుతోంది.








