పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేతన్‌ను అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి లోహగఢ్ కోటపై నుంచి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించారు. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్‌కు చెందిన చేతన్ స్నేహితుడు రితేష్ హింగేను అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు సంబంధించిన ప్రణాళిక గురించి రితేష్‌కు ముందుగానే తెలుసని పోలీసులు వెల్లడించారు. చేతన్ తన ప్రణాళికలను ఎప్పటికప్పుడు రితేష్‌తో పంచుకున్నట్లు పూణే ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. దర్యాప్తులో రితేష్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలతో పాటు కొన్ని సాంకేతిక ఆధారాలు లభించాయని పోలీసులు చెబుతున్నారు.
కేతన్‌ను హత్య చేసేందుకు తొలుత కిరాయి హంతకుడిని ఉపయోగించాలని చేతన్, సియా భావించినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తామే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన లోహగఢ్ కోటను ఘటనకు ముందు రితేష్ సందర్శించాడా? లేదా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.








