చిన్న చిన్న అలవాట్లే మన మెదడు పనితీరును నిర్దేశిస్తాయి. కానీ, వాటిలో చాలా అలవాట్లు మనకు తెలియకుండానే మన జీవితంలో భాగమైపోతాయి. చూసేందుకు చాలా సాధారణంగా అనిపించే కొన్ని అలవాట్లు.. మెల్లమెల్లగా మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తాయి. అయితే, చిన్నచిన్న మార్పుల ద్వారా ఈ నష్టాన్ని చాలా వరకు పునరుద్ధరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనకు తెలియకుండానే మెదడును దెబ్బతీసే అలవాట్లు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
నిద్ర లేచిన వెంటనే : ఉదయపు కాంతి మన శరీర అంతర్గత గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి, రోజంతా మనల్ని అప్రమత్తంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేచిన తర్వాత మొదటి గంట పాటు ఇంట్లోనే చీకటిగా లేదా కృత్రిమ వెలుతురులో ఉండిపోవడం వల్ల మెదడు సహజ లయ గందరగోళానికి గురవుతుందట. దీనివల్ల ఆలోచనా వేగం, ఏకాగ్రత తగ్గుతాయని అంటున్నారు.
ఏం చేయాలంటే : నిద్ర లేచిన వెంటనే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బయటకు వెళ్లి నడవడం లేదా కాసేపు ఎండలో నిలబడటం లాంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆకాశం మబ్బుగా ఉన్న రోజుల్లో కూడా, మెదడును చురుకుగా మార్చడానికి అవసరమైన కాంతి ప్రకృతి నుంచి మనకు లభిస్తుందంటున్నారు.
ఫోన్ స్క్రోలింగ్ చేయడం : ఫోన్‌లో వివిధ యాప్‌ల మధ్య పదే పదే మారడం, స్క్రీన్‌ను స్క్రోల్ చేయడం వల్ల.. మెదడు ఎప్పుడూ పైపైన ఏకాగ్రత స్థితికే అలవాటు పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల జ్ఞాపకశక్తి మందగించడమే కాకుండా, మానసిక అలసట, ఒత్తిడి కూడా వేగంగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయంటున్నారు.
ఏం చేయాలంటే : దీనికోసం ‘బ్యాచ్ స్క్రోలింగ్’ పద్ధతిని అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అంటే, రోజంతా పదే పదే ఫోన్ చూడకుండా, ప్రతి మూడు గంటలకొకసారి లేదా మీ వీలును బట్టి కొన్ని నిర్దిష్ట సమయాల్లో మాత్రమే సోషల్ మీడియా యాప్‌లను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆ సమయాల మధ్య వ్యవధిలో మెదడు పూర్తి ఏకాగ్రతతో పనిచేయడం నేర్చుకుంటుందని సలహా ఇస్తున్నారు.
ఆలస్యంగా ఆహారం తినడం : రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో కూడా జీర్ణక్రియపైనే మెదడు శ్రద్ధ పెట్టాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గాఢ నిద్రలో.. రోజంతా నేర్చుకున్న విషయాలను జ్ఞాపకాలుగా భద్రపరుచుకునే ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఉదయానికి మెదడు అలసటగా అనిపిస్తుందని అంటున్నారు. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఆహారం తీసుకోవడం అనేది డోపమైన్ లయల అసమతుల్యతకు కారణమవుతుందని National Library of Medicine పేర్కొంది.
ఏం చేయాలంటే : రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు చామంతి టీ లేదా పసుపు పాలు వంటి వెచ్చని పానీయం తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతపడి, గాఢ నిద్ర పట్టడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు.
ఒత్తిడిని గుర్తించకుండా మనసులోనే దాచుకోవడం : ఒత్తిడికి గల అసలు కారణాన్ని తెలుసుకోకుండా.. లో లోపలే దాచుకోవడం వల్ల, మెదడులోని మనుగడ సర్క్యూట్లు (Survival Circuits) ఎక్కువ కాలం పాటు అనవసరంగా ఉత్తేజితమై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఒక నిర్దిష్ట భావాన్ని సరిగ్గా గుర్తించలేనప్పుడు, అది చుట్టుపక్కల జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఒక ప్రమాదంగానే భావించి నిరంతరం ఆందోళనకు గురిచేస్తుందని అంటున్నారు. ఒత్తిడి వల్ల అధివృక్క గ్రంథులు అధిక కార్టిసాల్‌ను ఉత్పత్తి చేసి విడుదల చేస్తాయని, ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని Harvard Health Publishing పేర్కొంది.
ఏం చేయాలంటే : ఒత్తిడికి గల అసలు కారణాన్ని గుర్తించాలంటున్నారు నిపుణులు. అది కోపం, ఆందోళన లేదా తప్పు చేశామనే భావన ఏదైనా కావచ్చట. ఇలా భావోద్వేగాన్ని స్పష్టంగా గుర్తించడం వల్ల, మెదడులో భయాన్ని, ఒత్తిడిని నియంత్రించే ‘అమిగ్డాలా’ భాగం తీవ్రత తగ్గి, మెదడు వెంటనే ప్రశాంతపడుతుందని సూచిస్తున్నారు.
చిన్నపాటి కదలికల విరామాలు : ఎక్కువ సేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల మెదడుకు జరిగే రక్త ప్రసరణ గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులైన సరే, వరుసగా 60 నిమిషాల పాటు ఎలాంటి కదలిక లేకుండా కూర్చుంటే మెదడు మందగించి, మానసిక గందరగోళానికి గురవుతారని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏం చేయాలంటే : ప్రతి గంటకు ఒకసారి కేవలం కొన్ని నిమిషాల పాటు నిలబడటం, ఒళ్లు విరుచుకోవడం లేదా కాసేపు నడవడం లాంటివి చేయాలని చెబుతున్నారు. ఈ చిన్నపాటి కదలిక మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, దానిని చురుకుగా మార్చడానికి ఒక ‘రీసెట్ బటన్’ లాగా పనిచేస్తుందని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.









