దేశంలోని కొన్ని ప్రాంతాల్లో H1N1 ఇన్ఫ్లూయెంజా కేసులపై ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో.. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే అది సాధారణ వైరల్ ఇన్ఫెక్షనా? లేక ఇన్ఫ్లూయెంజా ఫ్లూనా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే లక్షణాలను మాత్రమే చూసి H1N1ని కచ్చితంగా నిర్ధారించడం సాధ్యం కాదు. ఫ్లూ సాధారణంగా అకస్మాత్తుగా మొదలవుతుంది. జ్వరం లేదా చలి, పొడి దగ్గు, తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఫ్లూ ఉన్న ప్రతి ఒక్కరికీ జ్వరం తప్పనిసరిగా ఉండదు.
సాధారణ జలుబు లేదా తేలికపాటి వైరల్ ఇన్ఫెక్షన్లో లక్షణాలు క్రమంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తుమ్ములు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్లూతో పోలిస్తే ఒళ్లు నొప్పులు, అలసట సాధారణంగా తక్కువగా ఉండొచ్చు. అయితే రెండు ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఒకదానితో ఒకటి పోలి ఉండే అవకాశం ఉన్నందున కేవలం లక్షణాల ఆధారంగా తేడా చెప్పడం కష్టం.
అందుకే జ్వరం ఎక్కువగా ఉందని మాత్రమే H1N1 అని భావించకూడదు.. తక్కువ జ్వరం ఉందని ఫ్లూ కాదని కూడా అనుకోకూడదు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించి అవసరమైతే ఫ్లూ పరీక్ష చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, తీవ్రమైన బలహీనత, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలి.








