పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. బుధవారం ఉదయం మదర్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగంలోని మూడో అంతస్తులో ఉన్న నర్సరీలో ఒక్కసారిగా ఎయిర్ కండిషనర్ కంప్రెసర్ పేలిపోయినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. క్షణాల్లోనే దట్టమైన పొగ, మంటలు నర్సరీ మొత్తం వ్యాపించడంతో అక్కడ ఉన్న నవజాత శిశువులు ప్రమాదంలో చిక్కుకున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో నర్సరీలో 16 మంది నవజాత శిశువులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే దట్టమైన పొగతో పరిస్థితి విషమంగా మారింది. పుట్టి కొద్దిరోజులైనా కాకముందే పసిపాపలు అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాద వాతావరణం నెలకొంది.
ఈ ఘటనతో ఆసుపత్రి భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అగ్నిప్రమాదానికి అసలు కారణం, ప్రమాద సమయంలో తీసుకున్న భద్రతా చర్యలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.









