అశ్వాపురం, ఆగస్టు 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వాపురం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు లూయిస్ ఫిలోమన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఫోటోగ్రఫీ రంగ పితామహుడిగా గుర్తింపు పొందిన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఫిలోమన్ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి లూయిస్ డాగురే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆవిష్కరణలు, కృషి కారణంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫోటోగ్రఫీ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. ఫోటోగ్రఫీ కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా సమాజంలోని సంఘటనలను భవిష్యత్ తరాలకు అందించే చారిత్రక బాధ్యత కూడా అని వివరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు తోట అశోక్ కుమార్, ట్రెజరర్ రమేష్‌తో పాటు మండలానికి చెందిన పలువురు ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.









