భార్యాభర్తలు లేదా కపుల్స్ మధ్య ఆహారం విషయంలో అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఒకరికి రోటీ, కూర ఇష్టమైతే.. మరొకరికి నూడుల్స్ లేదా పాస్తా తినాలని అనిపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ప్రతిసారీ ఒకరి ఇష్టానికి మరొకరు రాజీ పడాల్సిన అవసరం లేదనే ఆలోచనతో కొందరు ‘ఫుడ్ డివోర్స్’ అనే విధానాన్ని పాటిస్తున్నారు. అయితే ఇది భార్యాభర్తలు విడిపోవడం కాదు.. కేవలం ఆహారపు ఎంపికల్లో స్వేచ్ఛగా ఉండటమే.
ఉదాహరణకు ఒకరు త్వరగా డిన్నర్ చేయాలనుకుంటే, మరొకరికి ఆలస్యంగా తినే అలవాటు ఉంటే.. ఇద్దరూ తమకు అనుకూలమైన సమయంలో భోజనం చేయవచ్చు. అలాగే డైట్, ఫుడ్ అలర్జీలు, శాకాహారం లేదా మాంసాహారం వంటి కారణాలతో ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉన్న కపుల్స్‌కు కూడా ఈ విధానం ఉపయోగపడొచ్చు. ప్రతిరోజూ ‘ఈరోజు ఏం తినాలి?’ అనే విషయంలో చర్చలు, చిన్నపాటి గొడవలు జరగకుండా ఉండేందుకు ఇది ఒక మార్గంగా మారుతోంది.
అయితే ‘ఫుడ్ డివోర్స్’ అంటే ఎప్పుడూ విడివిడిగా తినాలని కాదు. ఇద్దరికీ ఒకే ఆహారం ఇష్టమైతే కలిసి భోజనం చేయవచ్చు. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో కలిసి డిన్నర్ చేయొచ్చు. ముఖ్యంగా ఆహారపు ఇష్టాలు వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకరి అభిరుచిని మరొకరు గౌరవించడం, ప్రతిసారీ రాజీ పడాల్సిన ఒత్తిడిని తగ్గించుకోవడమే ఈ ట్రెండ్ ఉద్దేశం.








