స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒప్పో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ‘ఫైండ్ ఎక్స్10’ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో కంటి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేకమైన ఐ-ప్రొటెక్షన్ డిస్‌ప్లేను ఉపయోగించనున్నట్లు తాజా లీక్‌లు చెబుతున్నాయి. ఒప్పో స్వయంగా అభివృద్ధి చేస్తున్న ఈ ప్యానెల్ BT.2020 కలర్ గామట్‌కు సపోర్ట్ చేయడంతో పాటు బ్లూ లైట్ ఉద్గారాలను తగ్గించి, కళ్లకు అనుకూలమైన రెడ్ లైట్ స్థాయిని పెంచనున్నట్లు తెలుస్తోంది.
స్టాండర్డ్ ఫైండ్ ఎక్స్10 మోడల్‌లో 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్ ఉండనున్నట్లు సమాచారం. పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 9600 లైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది డైమెన్సిటీ 9500కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. గత తరం ఫైండ్ ఎక్స్9లో ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i వంటి ఫీచర్లకు మించి కొత్త సిరీస్‌లో మరింత అధునాతన హార్డ్‌వేర్ ఉండొచ్చని అంచనా.
కెమెరా విభాగంలోనూ ఒప్పో భారీ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఏకంగా 200MP ప్రధాన కెమెరాను అందించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫైండ్ ఎక్స్10 సిరీస్ సెప్టెంబర్ నెలాఖరులో ప్రపంచ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లు, విడుదల తేదీపై ఒప్పో నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








