అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి సమావేశం కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 2026 నవంబర్‌లో చైనాలో జరిగే ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) సదస్సుకు హాజరయ్యే సమయంలో కిమ్‌తో ప్రత్యేకంగా భేటీ కావాలని ట్రంప్ తన అధికారులను కోరినట్లు సమాచారం. దీంతో గతంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన ట్రంప్-కిమ్ దౌత్యం మరోసారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కిమ్‌తో సంబంధాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాల స్థాయిని తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కిమ్‌తో తనకు ఉన్న మంచి సంబంధాలే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా ఈ సైనిక విన్యాసాలను చాలాకాలంగా భద్రతా ముప్పుగా పరిగణిస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కిమ్‌తో 2018లో సింగపూర్, 2019లో హనోయ్, ఆ తర్వాత పన్ముంజోమ్లో మూడుసార్లు సమావేశమయ్యారు.
అయితే ప్రస్తుతం పరిస్థితులు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరుకోగల క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సైనిక సహకారం అందించడం ద్వారా కిమ్.. పుతిన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. మరోవైపు చైనాతోనూ ఉత్తర కొరియా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్-కిమ్ భేటీ జరిగితే అణ్వాయుధాలు, భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు కీలకంగా మారే అవకాశం ఉంది.








