తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ ప్రమోషన్ల వివాదం తీవ్రంగా మారుతోంది. చట్టవిరుద్ధమైన ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ నటి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో సీఐడీ విచారణను ఎదుర్కొన్న ఆమెను తాజాగా ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణిత తదితర ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసును పరిశీలిస్తున్న అధికారులు సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రైల్స్‌పై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ.. రానున్న రోజుల్లో మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు యువతపై చూపుతున్న ప్రభావం, చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








