రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్ నగరంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్‌మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
స్టీల్ ప్లాంట్‌పై జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో 14 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి తీవ్రతతో ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని కీలక పారిశ్రామిక ప్రాంతాలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. క్రివీ రిహ్ నగరంపై జరిగిన దాడుల్లో మరికొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు సమాచారం. దాడుల కారణంగా పరిశ్రమల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో పరిస్థితిపై అధికారులు సమీక్షిస్తున్నారు.








