హిందీ, తెలుగు చిత్రాల్లో నటించిన నటి అనన్య రాజ్ (అనన్య సేన్ గుప్తా) 27 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత ఏడాది కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 2026 జూలై 15న ముంబైలో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ విషాద వార్తను ఆమె కుటుంబం దాదాపు నెల రోజుల తర్వాత ఆగస్టు 16న సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.
1998 ఆగస్టు 10న జన్మించిన అనన్య రాజ్.. హిందీ చిత్ర పరిశ్రమలో ‘ఘోస్ట్’, ‘7 అవర్స్ టు గో’, ‘ది ఫైనల్ ఎగ్జిట్’ వంటి సినిమాల్లో నటించారు. తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించిన ‘తగ్గేదే లే’ (2022) సినిమాలో కీలక పాత్ర పోషించారు.
చిన్న వయసులోనే అనన్య మృతి చెందడం సినీ వర్గాలను విషాదంలోకి నెట్టింది. ఆమె మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెకు నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.








