E-PAPER

మోరంపల్లి బంజరలో మాలల న్యాయ పోరాట సభ ఎస్సీ ఉపవర్గీకరణ పునఃసమీక్షకు డిమాండ్


బూర్గంపాడు, ఆగస్టు 17 (వై7 న్యూస్): బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల (TEAM) ఆధ్వర్యంలో నిర్వహించిన “మాలల న్యాయ పోరాట సభ” ఆదివారం ఘనంగా జరిగింది. ఎస్సీ ఉపవర్గీకరణ, రోస్టర్ విధానం కారణంగా మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై సభలో నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి భూపల్లి నరసింహారావు అధ్యక్షత వహించగా, శనగ మల్లేష్, శనగ అప్పారావు నిర్వహించారు. పాల్వంచ, భద్రాచలం, బూర్గంపాడు తదితర ప్రాంతాల నుంచి మాల సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న TEAM కన్వీనర్ దాసరి రమేష్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిరికల్ డేటా ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ జరగాలని కోరారు. ఎస్సీలలోని 59 కులాల సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి రిజర్వేషన్ ప్రయోజనాలు అందని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ శనగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ మాల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావడం గర్వకారణమన్నారు. మాలల ఐక్యతే భవిష్యత్ విజయాలకు పునాది అవుతుందని పేర్కొన్నారు.

సభలో ఎస్సీ ఉపవర్గీకరణ విధానాన్ని పునఃసమీక్షించడం, ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచడం, రోస్టర్ పాయింట్ల సవరణ, చేవెళ్ల డిక్లరేషన్ హామీల అమలు తదితర అంశాలపై తీర్మానాలు ఆమోదించారు.

అదేవిధంగా మాల విద్యార్థులు, నిరుద్యోగులు, కుటుంబాల హక్కుల సాధన కోసం జిల్లాలోని ప్రతి మాల పల్లెలో “మాలల చైతన్య యాత్ర” నిర్వహించాలని సభ పిలుపునిచ్చింది. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ పల్లా రాజశేఖర్, ఆచార్య డా. మద్దెల శివకుమార్, అడ్వకేట్ పంబా నాగేశ్వరరావు, శెట్టి కమలాకర్, యర్రపోతు కళ్యాణ్, బూర్గుల కరుణాకర్, శనగ వెంకటేశ్వర్లు, బరగడి దేవదానం, శనగ స్వామి, తలారి కిషోర్ బాబు, కూరపాటి దాసు, పండగ రాములు, కొత్తపల్లి శ్రీనివాస్, పుట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!